ఆ ఎంపీ మనమరాలు... టపాసులు కాల్చే ప్రయత్నంలో దుర్మరణం
BJP MP Rita Joshi's Granddaughter Dies. దీపావళి పండుగ.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని, వెలుగుల్ని నింపాలని కోరుకుంటూ
By Medi Samrat
దీపావళి పండుగ.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని, వెలుగుల్ని నింపాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఆ బీజేపీ మహిళా ఎంపీ కుటుంబలో విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ఎంపీ రీటా బహుగుణ జోషి మనవరాలు దీపావళి వేడుకల్లో ప్రమాదానికి గురై కన్నుమూసింది. రీటా బహుగుణ మనమరాలు టపాసులు కాలుస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలపాలైన ఆరేళ్ల చిన్నారిని ప్రయాగ్‌రాజ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. 60 శాతం వరకు కాలిన గాయాలతో అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె మరణించింది. యూపీకి చెందిన రీటా బహుగుణ ప్రస్తుతం అలహాబాద్ నియోజవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ప్రయాగ్ రాజ్ లోని రీటా బహుగుణ నివాసంలో దీపావళి రోజున రాత్రి అందరూ టపాసులు కాలుస్తూ ఉండగా.. ఆరేళ్ల మనవరాలు కియా భవనం టెర్రస్ పైకి వెళ్లి టపాసులు కాలుస్తూ ఉంది. ఆ సమయంలో నిప్పురవ్వలు ఆమె దుస్తులకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఇతర కుటుంబ సభ్యులు బాణసంచా కాల్చుతుండడంతో కియా అరుపులు ఎవరికీ వినిపించలేదు. కొంతసేపటి తర్వాత గమనిస్తే కాలిన గాయాలతో కియా టెర్రస్ పై పడివుంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తరలించే ఏర్పాట్లలో ఉండగానే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఢిల్లీ తీసుకువెళ్లాలని భావించామని, అయితే అంతలోనే దురదృష్టవశాత్తూ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు.