కనుగుడ్లు పీకేస్తా, చేతులు నరికేస్తా అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకుడు మనీష్ గ్రోవర్‌ను వ్యతిరేకిస్తే బాగోదు అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఆయన హెచ్చరించారు. శుక్రవారం నాడు రోహ్తక్ జిల్లా కిలోయ్ విలేజ్‌లోని ఆలయంలో ఉన్న బీజేపీ నాయకుడు మనీష్ గ్రోవర్‌ను రైతులు చుట్టు ముట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు.. పని పాటా లేని తాగుబోతులని మనీష్ గ్రోవర్ విమర్శించారు. దీంతో రైతులు గ్రోవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీష్ గ్రోవర్ ఆలయంలో ఉన్నట్లు తెలుసుకున్న రైతులు.. ఆలయాన్ని చుట్టుముట్టారు.
సుమారు 8 గంటల పాటు ఆలయంలోనే గ్రోవర్‌ను రైతులు నిర్బంధించారు. క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేయడంతో చివరకు చేతులు జోడించి గ్రోవర్ క్షమాపణ చెప్పారు. అనంతరం అతడు అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇదే విషయమై కాంగ్రెస్ నేతలు మనీష్ గ్రోవర్‌పై విమర్వలు చేశారు. అయితే తాను రైతులకు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని, వాళ్లు చేతులు ఊపాలని చెప్పడంతో అలా చేశానని గ్రోవర్ చెప్పారు. ఈ పరిణామాలపై రోహతక్ బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ స్పందించారు. మనీష్ గ్రోవర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ నాయకుల కనుగుడ్లు పీకేస్తామని, చేతులు నరికేస్తామని హెచ్చరించారు. హర్యానాలో తాము 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని అన్నారు.