బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్‌పై 10 నెలల్లో రెండోసారి అత్యాచారం కేసు నమోదైంది. ఆయన రాజస్థాన్‌లోని గోగుండా నియోజకవర్గం ఎమ్మెల్యే. రెండు సందర్భాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి.. పెళ్లి చేసుకుంటాననే సాకుతో మహిళలపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఓ మహిళ అంబామాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ని ఆశ్రయించి, ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతాప్ భీల్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని భీల్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది.
సుఖేర్‌లో కూడా 10 నెలల క్రితం ఎమ్మెల్యేపై మరో అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఉద్యోగం కోసం ప్రతాప్ భీల్ ను తాను కలిసిన తర్వాత తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని మహిళ పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి అతడు తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడని ఆ మహిళ ఆరోపించింది. గతేడాది మార్చిలో ఎమ్మెల్యే తన ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని కూడా హామీ ఇచ్చాడని తెలిపింది. ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు.