నవీన్ మృతదేహం తరలింపుపై ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
BJP MLA Arvind Bellad Faces Flak Over Naveen ‘Dead Body’ Remark.ఉక్రెయిన్‌లో ప్రస్తుతం భీకర యుద్దం నడుస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 4 March 2022 9:57 AM GMTఉక్రెయిన్‌లో ప్రస్తుతం భీకర యుద్దం నడుస్తోంది. రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. యుద్ధం నడుస్తుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు అండర్ గ్రౌండ్ మెట్రోస్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కాగా.. రష్యా దాడిలో కర్ణాటకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతి చెందిన విషయం తెలిసిందే. కొడుకు ఆఖరి చూపునా దక్కుతుందా అని అతడి తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అతడి మృతదేహాన్ని తీసుకురావాలని వారు విజ్క్షప్తి చేస్తుండగా.. ఓ ఎమ్మెల్యే మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు.
విమానంలో మృతదేహాన్ని తీసుకురావాలంటే చాలా ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుందని.. ఆ స్థలంలో మరో 8 నుంచి 10 మంది విద్యార్థులను తీసుకురావచ్చునని కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నబీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని ఎప్పుడు తీసుకువస్తారని ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
'నవీన్ మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఉంది. అందరికీ దాని గురించి తెలుసు. అక్కడ చిక్కుకున్న విద్యార్థులను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ మృతదేహాన్ని తీసుకువస్తాము. అయితే.. బతికి ఉన్న వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడం చాలా సవాలుగా మారింది. ఇక చనిపోయిన వారిని తీసుకురావడం మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే మృతదేహం విమానంలో ఎక్కువ స్థలం తీసుకుంటుంది. ఆ స్థలంలో 8 నుంచి 10 మందిని తీసుకురావచ్చు అని అరవింద్ బెల్లాడ్ అన్నారు. కాగా.. అరవింద్ బెల్లాడ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
మరోవైపు.. నవీన్ డెడ్ బాడీని రెండు రోజుల్లో ఇంటికి తీసువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు నవీన్ తండ్రి జ్ఞానగౌడ్ తెలిపారు.