బీజేపీ రాష్ట్రంలో భయం, హింస లేకుండా చేసింది : మోదీ

BJP made Tripura free from fear and violence. త్రిపురను గ‌తంలో పాలించిన‌ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విరుచుకుపడ్డారు

By Medi Samrat  Published on  11 Feb 2023 3:18 PM IST
బీజేపీ రాష్ట్రంలో భయం, హింస లేకుండా చేసింది : మోదీ

త్రిపురను గ‌తంలో పాలించిన‌ పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విరుచుకుపడ్డారు. బిజెపి రాష్ట్రంలో భయం, హింస లేకుండా మార్చిందని ఆయ‌న అన్నారు. ధలై జిల్లాలోని అంబాస్సాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల పాలన త్రిపుర అభివృద్ధికి ఆటంకం కలిగించిందని విమ‌ర్శించారు. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని తీసుకొచ్చిందని అన్నారు. హింస అనేది త్రిపురకు గుర్తింపు కాదు.. బీజేపీ రాష్ట్రాన్ని భయం, హింస లేకుండా చేసిందని పేర్కొన్నారు. గతంలో త్రిపురలో పోలీస్ స్టేషన్లను సీపీఎం క్యాడర్ కబ్జా చేసిందని, కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. "ఇప్పుడు, రాష్ట్రంలో మహిళా సాధికారత ఉంది.. జీవించడానికి సౌకర్యం ఉంది" అని అన్నారు. బిజెపి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్న‌ ప్రధాని.. "త్రిపురలో గ్రామాలను కలుపుతూ 5,000 కి.మీ రోడ్లు నిర్మించబడ్డాయి. అగర్తలాలో కొత్త విమానాశ్రయం కూడా నిర్మించబడింది. గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్, 4G కనెక్టివిటీని తీసుకువచ్చింద‌ని అన్నారు. ఇప్పుడు త్రిపుర ప్రపంచవ్యాప్తం అవుతోంది. మేము ఓడరేవులతో అనుసంధానించడానికి జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

బిజెపి 55 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మిగిలిన ఐదు స్థానాలను తన కూటమికి ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి)కు వదిలిపెట్టింది. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి మొత్తం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.


Next Story