సాయంత్రం కాదు ఉద‌య‌మే.. ఢిల్లీ నూత‌న‌ సీఎం ప్రమాణ స్వీకార షెడ్యూల్ మార్పు..!

ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఫిబ్రవరి 19న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది,

By Medi Samrat
Published on : 18 Feb 2025 3:16 PM IST

సాయంత్రం కాదు ఉద‌య‌మే.. ఢిల్లీ నూత‌న‌ సీఎం ప్రమాణ స్వీకార షెడ్యూల్ మార్పు..!

ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఫిబ్రవరి 19న బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది, అందులో ముఖ్యమంత్రి పేరును ప్రకటించనున్నారు, అయితే వీటన్నింటి మధ్య.. ఇప్పుడు బీజేపీ ప్రమాణ స్వీకార షెడ్యూల్‌ను మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విష‌య‌మై బీజేపీ అధికారిక వ‌ర్గాలు క్లారిటీ ఇవ్వాల్సివుంది.

ఇంతకుముందు ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరగనున్న‌ట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీలో శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం నేడు పరిశీలకులను నియమించనుంది. పరిశీలకులు పార్టీకి కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఇందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో శాసనసభా పక్ష నేత సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై స‌మాచారాన్ని అందిస్తారు.

ప్రమాణ స్వీకారోత్సవాన్ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాంలీలా మైదాన్‌లో సన్నాహాలు ప్రారంభించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వినోద్‌ తావ్డే, తరుణ్‌ చుగ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తదితర నేతలు సన్నాహాలకు సంబంధించి అధికారులతో సమావేశం కానున్నారు.

ఈ ఫంక్షన్‌కు సంబంధించి ప్ర‌ముఖుల‌కు ఆహ్వాన పత్రికలు పంపే పని కూడా మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ప్రధాని, కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను ఆహ్వానిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలకు సహకరించిన కార్యకర్తలు, నాయకులందరినీ కూడా పిలుస్తున్నారు.

Next Story