క‌నిపించ‌కుండా పోయిన బీజేపీ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్.. పార్టీ కార్యాలయంలో దొరికిన‌ మృత‌దేహం

బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీజేపీ ఐటీ సెల్ మథురాపూర్ జిల్లా కన్వీనర్ పృథ్వీరాజ్ నస్కర్ మృతదేహాన్ని వెలికితీయడం మిస్టరీగా మిగిలిపోయింది.

By Medi Samrat  Published on  9 Nov 2024 1:24 PM GMT
క‌నిపించ‌కుండా పోయిన బీజేపీ ఐటీ సెల్ జిల్లా కన్వీనర్.. పార్టీ కార్యాలయంలో దొరికిన‌ మృత‌దేహం

బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీజేపీ ఐటీ సెల్ మథురాపూర్ జిల్లా కన్వీనర్ పృథ్వీరాజ్ నస్కర్ మృతదేహాన్ని వెలికితీయడం మిస్టరీగా మిగిలిపోయింది. నవంబర్ 4 నుంచి మధురాపూర్‌లోని ఉస్తి గ్రామం నుంచి నస్కర్ కనిపించకుండా పోయినట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి. ఆయన మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లాలోని మందిర్ బజార్ ప్రాంతంలో ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహంపై గాయాల గుర్తులు ఉండడంతో పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇది రాజకీయ హత్య అని మృతుడి తండ్రి అమరేంద్ర నస్కర్ ఆరోపిస్తూ.. ఆర్జీ కర్ ఆసుపత్రిలో దారుణానికి గురైన మహిళా వైద్యురాలికి న్యాయం చేయాలంటూ దుర్గాపూజ సందర్భంగా పోస్టర్లు వేసినందుకు తన కుమారుడికి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. ఆగస్టు 9న కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్ మృతదేహం లభ్యమైంది.

అభయకు న్యాయం చేయాలంటూ పోస్టర్లు వేసినందుకు స్థానిక టీఎంసీ నాయకుడు తన కుమారుడిని బెదిరించాడని అమరేంద్ర ఆరోపించారు. ఐటి సెల్ జిల్లా కన్వీనర్ పృథ్వీరాజ్ నస్కర్‌ను అధికార టిఎంసి గూండాలు కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని రాష్ట్ర బిజెపి శనివారం X పోస్ట్‌లో ఆరోపించింది. హత్యానంతరం TMC గూండాలు మృతదేహాన్ని పార్టీ కార్యాలయంలో వదిలేశారని.. మమతతో కుమ్మక్కైన పోలీసులు సహాయం కోసం ఆ కుటుంబం చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదని బీజేపీ పేర్కొంది. మమతా బెనర్జీ బెంగాల్‌ను అస్తవ్యస్తంగా, రక్తంతో తడిసిన నియంతృత్వ పాలనగా మార్చారని ఆ పార్టీ రాసింది.

మరోవైపు స్థానిక TMC నాయకుడు ఇమ్రాన్ హసన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ సంఘటన బిజెపిలో అంతర్గత పోరు ఫలితంగా కనిపిస్తోందని అన్నారు. బీజేపీ కార్యాలయంలో మృతదేహం ఎందుకు దొరికిందని ప్రశ్నించారు. మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రిలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Next Story