ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన బీజేపీ నేత దారుణ హత్య
BJP leader close to Haryana CM Manohar Lal Khattar shot dead inside showroom in Gurugram. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడైన బీజేపీ నేత
By Medi Samrat Published on 2 Sep 2022 2:23 PM GMTహర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడైన బీజేపీ నేతను గురుగ్రామ్‌లో హత్య చేశారు. క్లాత్ షోరూమ్‌లో ఉండగా ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. రిథోజ్ గ్రామానికి చెందిన మృతుడు సుఖ్‌బీర్ ఖతానా అలియాస్ సుఖి తన స్నేహితుడితో కలిసి షోరూమ్‌కు వెళ్లినప్పుడు సదర్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సోహ్నా మార్కెట్ కమిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ ఖతానా బుల్లెట్ గాయాలతో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఖతానాను సమీపంలోని ఆర్వీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. సుఖ్‌బీర్ ఖతానా సోహ్నా నుంచి జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
మధ్యాహ్నం 3.20 గంటలకు సుఖ్‌బీర్ ఖతానా తన స్నేహితుడు రాజేందర్‌తో కలిసి కియా కారులో గురుద్వారా రోడ్‌లోని రేమండ్ షోరూమ్‌కు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. షోరూమ్ దగ్గర కారు పార్క్ చేసి షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్లారు. క్లాత్ షోరూమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఘటన రికార్డు అయింది. ఐదుగురు దుండగులు కాల్చిన తర్వాత షోరూమ్ నుండి వెళ్లిపోయారు. వారిలో ఇద్దరు నల్ల టీ-షర్టులు, ఒకరు తెల్ల చెక్ షర్టు, మరొకరు టోపీ, ఒక ఎరుపు చొక్కా ధరించి ఉన్నట్లు కనిపిస్తోంది. డిసిపి (వెస్ట్) దీపక్ సహారన్ నేతృత్వంలోని పోలీసు బృందం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, క్రైమ్ సీన్ బృందం సహాయంతో సంఘటన స్థలాన్ని పరిశీలించింది.
ఖతానాకు బావ అయిన చమన్ తన సహచరులతో కలిసి కాల్చి చంపాడని ఖతానా కుమారుడు అనురాగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. చమన్, ఇతరులపై IPC సెక్షన్లు 302 (హత్య) మరియు 120-B (నేరపూరిత కుట్ర), ఆయుధ చట్టంలోని 25-54-59 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. నిందితులను పట్టుకోడానికి క్రైమ్ యూనిట్ టీమ్‌తో సహా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. పలువురు నిందితులను గుర్తించామని, వీలైనంత త్వరగా వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.