'రేపు ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరు కావాలి'.. విప్ జారీ చేసిన బీజేపీ
వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2వ తేదీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
By Medi Samrat
వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2వ తేదీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోక్‌సభ ఎంపీలందరికీ.. రేపు అంటే ఏప్రిల్ 02వ తేదీన పార్లమెంటుకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. ఇక ఈ బిల్లుపై చర్చకు 12 గంటల సమయం కావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
బుధవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు బీజేపీ నేతల వ్యాఖ్యలు తెర మీదకు వస్తున్నాయి. కాగా.. ప్రతి మంచి పనికి వ్యతిరేకత ఎదురవుతుందని.. అదేవిధంగా వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి అపార్థాలు సృష్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. సీఏఏ విషయంలో ముస్లింలను తప్పుదోవ పట్టించి షాహీన్‌బాగ్‌లో నిరసనలు జరిగినట్లే, వక్ఫ్ చట్టం విషయంలో కూడా అదే వ్యక్తులు ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లులో ఎక్కడా మసీదులు, దర్గాలు, ఇతర మతపరమైన స్థలాలను ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పలేదన్నారు. ఎవరి వల్లా తప్పుదోవ పట్టకూడదనే పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. వక్ఫ్ ఆస్తులపై మాఫియాల గుత్తాధిపత్యాన్ని అంతం చేయడం మాత్రమే ఈ బిల్లు ఉద్దేశం అన్నారు.