బీజేపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్, ఆరేళ్లు బహిష్కరణ వేటు..
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌కు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik
బీజేపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్, ఆరేళ్లు బహిష్కరణ వేటు
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ ఆయనకు లేఖ రాసింది. పార్టీతో పాటు మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 10న షోకాజ్ నోటీసులు జారీ చేసిన బీజేపీ..లేటెస్ట్‌గా ఆయనపై కఠిన చర్యలు తీసుకుంది.
యత్నాళ్ పదేపదే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, రాష్ట్ర స్థాయి నాయకత్వంపై విమర్శలు చేయడం కారణాలుగా తెలుస్తున్నాయి. అంతేకాదు ఇటీవల అక్రమ బంగారం కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావుపై యత్నాళ్ తీవ్ర అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకున్నప్పటికీ.. యత్నాళ్ తన వైఖరిని మార్చుకోలేదని పార్టీ ఆరోపించింది.
బసనగౌడ రియాక్షన్ ఇదే..
కాగా తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై బసనగౌడ రియాక్ట్ అయ్యారు. వారసత్వ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పార్టీలో సంస్కరణలు, వ్యక్తుల ఆధిపత్యాన్ని తొలగించాలని, ఉత్తర కర్ణాటకను డెవలప్ చేయాలని అడిగినందుకు తనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. ముక్కుసూటిగా మాట్లాడినందుకు ఇది పార్టీ తనకు ఇచ్చిన రివార్డుగా పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా, ఉత్తర కర్ణాటక అభివృద్ధి, హిందుత్వ కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఇదే ఉత్సాహం, దృఢ సంకల్పంతో ప్రజాసేవ చేస్తానని, తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.