రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా
తెలంగాణతో పాటు ఇవాళ మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 10:30 AM ISTరాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హవా
తెలంగాణతో పాటు ఇవాళ మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కూడా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో అధికార పార్టీ బీజేపీ హవా కొనసాగుతోంది. అక్కడ 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్నింటికి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. 160 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ 63 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే.. ఫలితాల్లో మాత్రం కాస్త తారుమారు అయ్యాయనే చెప్పాలి. ఇప్పటి వరకు అయితే.. బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలోనే దూసుకుపోతుంది. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 116 స్థానాలను గెలవాలి. అయితే.. బీజేపీ ఈ మార్క్‌ను దాటి 160 చోట్ల లీడింగ్‌లో ఉంది.
మరోరాష్ట్రం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. రాజస్థాన్‌లో ఉన్న 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో కూడా ఇవాళే ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ సారి రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ఆ పార్టీ సీనియర్ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇక్కడ కూడా బీజేపీ జోరు కొనసాగుతోంది. ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు ఇప్పటికైతే లీడింగ్‌లో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో బీజేపీ 105 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు 77 చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. మరో 17 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే.. రాజస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 100 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి. ఈ క్రమంలో ఇప్పటికైతే బీజేపీ 100కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. మరి చివరకు వరకు ఈ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.