మొబైల్ ఫోన్ లు వచ్చిన తర్వాత మన జీవితాలలో చాలా మార్పులు వచ్చాయి. అంతే కాదు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా తీసుకుని వచ్చాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నా కూడా కొందరు పట్టించుకోవడం లేదు. వడోదరకు చెందిన ఒక వ్యక్తి అయితే మొబైల్ ను వాడడంలో తనని మించిన వారే లేడని నిరూపించుకున్నాడు. రెండు చేతుల్లోనూ రెండు సెల్‌ఫోన్‌లను పట్టుకుని హ్యాండ్స్‌ఫ్రీగా బైక్‌ను నడుపుతున్న వ్యక్తి చేసిన అద్భుతమైన స్టంట్‌ని చూసి మనకు నవ్వు తెప్పించినా.. అతడు ఫైన్ మాత్రం కట్టాల్సి వస్తోంది.
వడోదర పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పోస్ట్ చేశారు. 'రెండు చేతుల్లోనూ రెండు ఫోన్లు. అది కూడా బైక్ నడుపుతూనే. ఈ మనిషి ఎంత బిజీగా ఉన్నాడో చూడండి' అనే క్యాప్షన్ తో పోస్టులు పెట్టారు. వీడియోలో ఆ వ్యక్తి హెల్మెట్ లేకుండా కనిపించాడు. రెండు చేతుల్లోనూ ఫోన్లు పట్టుకోవడంతో బైక్ హ్యాండిల్స్ పూర్తిగా వదిలేశాడు. ముఖేష్ మఖిజాని అనే సదరు వ్యక్తికి పోలీసులు ఈ-చలాన్ పంపారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపినందుకు అతనికి ₹1000 జరిమానా విధించారు.