బోధించడానికి ఎవరూ లేరని జీతం రిటర్న్ చేసిన ప్రొఫెసర్
Bihar Professor Returns Rs 24 Lakh Salary Of 3 Years Claiming He Has No Students To Teach. తన క్లాసులకు ఒక్క విద్యార్థి కూడా రాకపోవడంతో విసుగు చెందిన బీహార్‌లోని
By Medi Samrat Published on 7 July 2022 2:04 PM GMTతన క్లాసులకు ఒక్క విద్యార్థి కూడా రాకపోవడంతో విసుగు చెందిన బీహార్‌లోని ఒక ప్రొఫెసర్ సరికొత్తగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాడు. "బోధించడానికి ఎవరూ లేరు, కాబట్టి జీతం ఎందుకు" అంటూ సదరు లెక్చరర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌లోని ఒక కళాశాల లెక్చరర్ తన క్లాస్ కు విద్యార్థుల హాజరు సరిగా లేకపోవడంపై అసంతృప్తితో ఈ పని చేశారు. తన నిరసనను ప్రభుత్వం ఇంకా గుర్తించనప్పటికీ.. అతను తన రెండు సంవత్సరాల తొమ్మిది నెలల జీతం.. రూ. 23.8 లక్షలను తిరిగి ఇచ్చేశాడు. ముజఫర్‌పూర్‌లోని నితీశ్వర్ కళాశాలలో హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన లల్లన్ కుమార్, తనను వేరే కళాశాలకు బదిలీ చేయాలని కోరుతూ ఉన్నారు. అలాగైతేనే తాను తన ఉద్యోగాన్ని సరిగా చేసుకోగలనని ఆయన భావిస్తూ ఉన్నారు.
"నేను ఉద్యోగంలో చేరినప్పుడు, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతులకు బోధించగల కళాశాలకు నన్ను పోస్ట్ చేయలేదు. తక్కువ ర్యాంకులు (సెలక్షన్ ప్రక్రియలో) ఉన్నవారు ఆ పోస్టింగ్‌లను పొందారు. ఇక్కడ విద్యార్థులు ఎప్పుడూ కనిపించరు." అని చెప్పుకొచ్చారు. బదిలీ జాబితా నుండి తన పేరు పదేపదే తొలగించబడిందని కుమార్ పేర్కొన్నారు. 0% హాజరు ఉందన్న వాదన నిరాధారమని కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ చెప్పారు. "కరోనావైరస్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా తరగతులకు అంతరాయం ఏర్పడింది" అని ఆయన చెప్పారు. "అతనికి బదిలీ కావాలంటే నేరుగా నాతో చెప్పి ఉండాల్సింది" అని అన్నారు. కళాశాలలో తరగతులు జరగడం లేదన్న ఫిర్యాదును తాము పరిగణనలోకి తీసుకున్నామని యూనివర్సిటీ పేర్కొంది. దీనిపై విచారణ జరుపుతాం అని బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్కే ఠాకూర్ తెలిపారు. "ప్రొఫెసర్ లల్లన్ కుమార్ మాకు చెక్ ఇచ్చాడు, కానీ మేము దానిని అంగీకరించలేదు." అని యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. పిహెచ్‌డి చేసిన లల్లన్ కుమార్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తీ చేశాడు.