బీహార్ పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు నారాయణ్ ప్రసాద్ కుమారుడు బబ్లూ ప్రసాద్ తన పొలంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలను భయపెట్టేందుకు కొంతమంది స్థానికులను కొట్టి గాలిలోకి కాల్పులు జరిపాడు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని హార్దియా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన కెమెరాకు చిక్కింది. బబ్లూ ప్రసాద్ తన చేతిలో రైఫిల్ పట్టుకుని పిల్లలను తరిమికొట్టినట్లు చిత్రాలు చూపించాయి. ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం. "పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. 4-5 మంది వ్యక్తులు వారిని కొట్టడం ప్రారంభించారు, ఒక వ్యక్తిని తుపాకీతో కొట్టారు. కాల్పులు జరిపారు. వారిలో ఒకరు నారాయణ్ ప్రసాద్ కుమారుడు" అని సంఘటనకు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ప్రతీకారంగా మంత్రి కుమారుడిని కొట్టిన గ్రామస్థులు
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు నారాయణప్రసాద్ నివాసానికి చేరుకుని ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి కొడుకును కొట్టారు. ఆసుపత్రిలో చేరిన బబ్లూ ప్రసాద్ గాలిలోకి కాల్పులు జరిపారనే ఆరోపణలను ఖండించారు. పోలీసు సూపరింటెండెంట్ ఉపేంద్ర వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి కుమారుడితో పాటు మామ హరేంద్ర ప్రసాద్, మేనేజర్ విజయ్, ఇతర సహచరులు ఉన్నారు. వీరంతా ఘర్షణలో గాయపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించడం జరిగిందని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.
గ్రామస్థులు తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ కుటుంబ సభ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేశారని నారాయణప్రసాద్ ఆరోపించారు. "నా కుటుంబ సభ్యులను గ్రామస్థులు కొట్టిన తరువాత, నా కొడుకు లైసెన్స్ పొందిన రైఫిల్, పిస్టల్‌తో సంఘటనా స్థలానికి వెళ్లాడు, కాని అతనిపై కూడా రాళ్లతో దాడి చేశారు. గ్రామస్థులు నా వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు" అని మంత్రి నారాయణ్ ప్రసాద్ చెప్పారు.