నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి.. బీజేపీ మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి దూరమయ్యారు. ఈ పరిణామాల కారణంగా NDA మిత్రపక్షాల మధ్య చీలిక మొదలైందనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. నితీష్ కుమార్ కొన్ని నెలలుగా బీజేపీకి దూరమవుతూ వస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి JD(U) చీఫ్ దూరంగా ఉన్నారు. ఆగస్ట్ 11 లోపు బీహార్‌లో NDA పాలన కూలిపోతుందా.. JD(U) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాజీ మిత్రపక్షమైన RJDతో చేతులు కలుపుతుందా..? అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.
బీహార్‌లో జేడీ(యూ)-బీజేపీ పొత్తు తెగిపోతోందని.. చాలా మంది జెడి(యు) ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతుండడంతో.. రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆ పార్టీ ఆర్‌జెడి, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌లతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని కథనాలు వస్తున్నాయి. గత నెల జులై 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి నితీష్ కుమార్ హాజరుకాలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందుకు ఆయనను ఆహ్వానించారు.. కానీ ఆయన దూరంగా ఉన్నారు. జూలై 22 న, నితీష్ కుమార్ NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు.
ఆగస్టు 7వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని నితీష్ కుమార్‌ను పిలిచినా ఆయన దూరంగా ఉన్నారు. ఆయన గైర్హాజరు వెనుక గల కారణాలపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో బిహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు.