గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..! నిన్ననే తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. 2016 నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా కొనసాగారు. ఏబీవీపీ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగారు. రూపానీ 1998లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2006-12 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
ఇక ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని బీజేపీ హైకమాండ్ ఎన్నుకుంది. గుజరాత్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ఎంపికచేసింది. గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.