డిసెంబర్ 12న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం.. రెండోసారి సీఎంగా భూపేంద్ర పటేల్

Bhupendra Patel to continue as Gujarat CM for second term. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్ ను శాసనసభా పక్ష నేతగా

By Medi Samrat  Published on  10 Dec 2022 3:09 PM IST
డిసెంబర్ 12న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం.. రెండోసారి సీఎంగా భూపేంద్ర పటేల్

కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడంతో ఆయ‌న‌ గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండవసారి కొనసాగనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం 'కమలం'లో జరిగిన సమావేశంలో పటేల్ పేరును ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ప్రకటించారు. "కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈరోజు 'కమలంలో' సమావేశమయ్యారు, అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను నియమించే ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు" అని బిజెపి ఒక ప్రకటనలో తెలిపింది.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు 60 ఏళ్ల పటేల్ శుక్రవారం తన మొత్తం మంత్రివర్గంతో కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి పటేల్ 1.92 లక్షల ఓట్లు సాధించి వరుసగా రెండోసారి విజయం సాధించారు. గతేడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.

గుజరాత్‌లో గురువారం నాడు జ‌రిగిన ఓట్ల లెక్కింపులో 182 మంది సభ్యులున్న సభలో 156 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా బిజెపి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది, ఇది 2017లో సాధించిన 99 సీట్ల కంటే చాలా ఎక్కువ. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం డిసెంబర్ 12న జరుగుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా హాజరవుతారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం గాంధీనగర్‌లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో సోమవారం జరుగుతుందని గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు.


Next Story