భోపాల్‌లోని ఒక మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) తన స్నేహితురాలి ఇంట్లో నుంచి రూ. 2 లక్షలు, మొబైల్ ఫోన్‌ను దొంగిలించారని ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారి దొంగతనం చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కూడా అయింది.
భోపాల్‌లోని జెహంగీరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన కుటుంబంతో అక్కడ నివసిస్తున్న ప్రమీల అనే మహిళ, డిఎస్పీ కల్పనా రఘువంశీతో చాలా సంవత్సరాలుగా స్నేహం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం తన పిల్లల స్కూల్ ఫీజు చెల్లించడానికి రూ. 2 లక్షలు డ్రా చేసి ఆ డబ్బును ఇంట్లో పెట్టుకున్నానని, ఆ తర్వాత స్నానం చేయడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి నగదు, మొబైల్ ఫోన్ రెండూ కనిపించలేదని ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రమీల తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేయగా, తన స్నేహితురాలు, డిఎస్పీ కల్పన రఘువంశి బ్యాగ్ తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లడం చూసి ఆశ్చర్యపోయింది. ఆమె పోలీసులను సంప్రదించి, ఆ ఫుటేజ్‌ను, లిఖితపూర్వక ఫిర్యాదుతో పాటు సమర్పించింది.
వీడియోను ధృవీకరించిన తర్వాత, రఘువంశీ తన చేతుల్లో నగదు కట్టలను మోసుకెళ్తున్నట్లు ఫుటేజ్‌లో కనిపించిందని పోలీసులు నిర్ధారించారు. ఈ ఆధారాలతో మహిళా డిఎస్పీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత, రఘువంశీ పరారీలో ఉన్నారు. ఆమె నివాసంలో పోలీసులు సోదాలు జరపగా ప్రమీల మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు, కానీ దొంగిలించబడిన రూ. 2 లక్షల జాడ ఇంకా కనిపించలేదు.