రేపు భారత్ బంద్.. 40,000 వాణిజ్య సంఘాలు మద్దతు
Bharat Bandh call for February 26. చమురు ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
By Medi Samrat Published on 25 Feb 2021 4:09 PM IST
చమురు ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు లారీ యజమానుల సంఘం మద్దతు పలికింది. అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని, ఏటా టోల్ రేట్ల పెంపుదలను నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం తగ్గించాలని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండడంతో భారీ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ ప్రకటించిన రేపటి బంద్ కు 40 వేల వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా డీజిల్ ధరలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, జీఎస్టీ విధానం సమీక్షించాలని ఆలిండియా ట్రాన్స్ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది. కొత్త ఈ-వే బిల్లుల విధానాన్ని రద్దు చేయాలని, మరికొన్ని నిబంధనలు కూడా రద్దు చేయాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తోంది.
ఈ నెల 26 వ తేదీన దేశ వ్యాప్త బంద్ కు అఖిల భారత వ్యాపార సమాఖ్య పిలుపునిచ్చింది. దేశంలోని ఎనిమిది కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 40,000 వాణిజ్య సంఘాలు ఫిబ్రవరి 26 న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) చే నిర్వహించబడే భారత్ బంద్ పిలుపులో భాగంగా సరుకు, సేవల పన్ను (జిఎస్‌టి) నిబంధనలను సమీక్షించాలని డిమాండ్ చేస్తోంది.