కాంగ్రెస్ మద్దతిచ్చినా అండగా నిలిచేవాళ్లం : ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏ ఒక్క వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ మద్దతు ఇవ్వదని, కేవలం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విధానాలకు మాత్రమే కట్టుబడి ఉంటుందని ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు

By -  Medi Samrat
Published on : 9 Nov 2025 9:20 PM IST

కాంగ్రెస్ మద్దతిచ్చినా అండగా నిలిచేవాళ్లం : ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏ ఒక్క వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ మద్దతు ఇవ్వదని, కేవలం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విధానాలకు మాత్రమే కట్టుబడి ఉంటుందని ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మాకు ఏ పార్టీ సొంతం కాదు, అలాగని ఏ పార్టీ పరాయిదీ కాదు. ఎందుకంటే అవన్నీ భారతీయ పార్టీలే. ఈ దేశం ఏ దిశలో పయనించాలనే దానిపై మాకు ఒక దార్శనికత ఉంది. ఆ దిశగా ఎవరు పనిచేసినా వారికి మా మద్దతు ఉంటుందని భగవత్ అన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వమని, ఎన్నికల్లో కూడా పాల్గొనబోమని స్పష్టం చేశారు. సమాజాన్ని ఏకం చేసే పనిలో సంఘ్ నిమగ్నమై ఉంది. కానీ రాజకీయాలు స్వభావరీత్యా విభజనకారిగా ఉంటాయని అన్నారు. ఉదాహరణకు, అయోధ్యలో రామ మందిరం కావాలని మేము కోరుకున్నాం. ఆ లక్ష్యం కోసం నిలబడిన వారికి మా వలంటీర్లు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ ఆ ఉద్యమంలో ఉంది కాబట్టి వారికి మద్దతిచ్చామన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రామమందిర ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఉంటే, మా కార్యకర్తలు ఆ పార్టీతోనే నిలబడేవారని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బెంగళూరులో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రసంగ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story