ప్రముఖ బెంగాలీ కార్టూనిస్ట్ నారాయణ్ దేబ్‌నాథ్ మంగళవారం ఉదయం సౌత్ కోల్‌కతా నర్సింగ్ హోమ్‌లో కన్నుమూశారు. ఆయన గత సంవత్సర కాలంగా మూత్రపిండాలు, గుండె సమస్యలతో సహా వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే పలుమార్లు ఆసుపత్రిలో చేరగా.. అతడి వైద్యం ఖర్చుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దేబనాథ్ జనవరి మొదటి వారంలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం విషయమై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
దేబ్‌నాథ్ మరణవార్త విన్న మమతా బెనర్జీ.. తన సందేశంలో, "ప్రముఖ బాలల రచయిత, కార్టూనిస్ట్ నారాయణ్ దేబ్‌నాథ్ మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను. ఈరోజు కలకత్తాలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 96 సంవత్సరాలు". "బంతుల్ ది గ్రేట్, హండా భోండా, నాంటే ఫోంటే, బహదూర్ బెరల్ మొదలైన పాత్రల సృష్టికర్త నారాయణ్ దేబ్‌నాథ్ అన్ని వయసుల పాఠకుల మనస్సులలో శాశ్వత స్థానాన్ని పొందారు" అని ఆమె చెప్పారు.
దేబ్‌నాథ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. "పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2013లో ఆయనకు 'బంగా బిభూషణ్' అవార్డును అందించింది. అంతేకాక ఆయనకు రాష్ట్రపతి అవార్డు, పద్మశ్రీ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు పలు అవార్డులు లభించాయి. బెంగాలీ సాహిత్య ప్రపంచంలో ఆయన మరణం తీరని లోటని పలువురు విచారం వ్యక్తం చేశారు.