60 ఏళ్ల వ‌య‌సులో బీజేపీ సీనియ‌ర్ నేత వివాహం.. వ‌ధువు ఎవ‌రంటే..?

పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పెళ్లి చేసుకోబోతున్నారు.

By Medi Samrat
Published on : 18 April 2025 3:45 PM IST

60 ఏళ్ల వ‌య‌సులో బీజేపీ సీనియ‌ర్ నేత వివాహం.. వ‌ధువు ఎవ‌రంటే..?

పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయ‌న బీజేపీ కార్య‌క‌ర్త‌ రింకూ మజుందార్‌ను పెళ్లాడబోతున్నారు. ఈరోజు అంటే ఏప్రిల్ 18న కోల్‌కతాలోని ఆయన నివాసంలో వివాహం జరగనుందని సమాచారం. 60 ఏళ్ల దిలీప్ ఘోష్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మూలాల ప్రకారం.. కునాల్ ఘోష్, దేబాంగ్షు భట్టాచార్యతో సహా పలువురు తృణమూల్ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ నాయకుడిని అభినందించారు.

దిలీప్ ఘోష్ సన్నిహితులను ఉటంకిస్తూ.. వారిద్దరూ మార్నింగ్ వాక్ సమయంలో కలుసుకున్నారని, కాలంతో పాటు వారి అనుబంధం మరింత బలపడిందని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. న్యూ టౌన్‌లోని ప్రైవేట్ వేడుకలో ఇద్దరూ వివాహం చేసుకోనున్నారు, దీనికి సమీప బంధువులు కూడా హాజరుకానున్నారు. పెళ్లి ప్రపోజల్ కూడా వధువు తరఫు నుంచి వచ్చిందని చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌తో సహా సీనియర్ బీజేపీ నాయకులు ఉదయం ఘోష్ న్యూ టౌన్ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు దిలీప్ ఘోష్, ఆయనకు కాబోయే భార్య హాజరయ్యారని ఆయనకు సన్నిహితుడైన బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వెల్ల‌డించారు.

అంతకుముందు.. దిలీప్ ఘోష్ ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుందని.. ఆమె కోరికను గౌరవిస్తూ నేను పెళ్లి చేసుకుంటున్నాను. నేను మునుపటిలా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటాను. నా రాజకీయ కార్యకలాపాలపై నా వ్యక్తిగత జీవితం ఎలాంటి ప్రభావం చూపదన్నారు.

నివేదిక ప్రకారం.. వధువు పేరు రింకూ మజుందార్. రింకూ చాలా కాలంగా బీజేపీ కార్యకర్త. పార్టీ మహిళా విభాగం, ఓబీసీ మోర్చా, చేనేత సెల్‌తో పాటు పలు కీలక బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. మజుందార్‌కి ఇది రెండవ వివాహం.. ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

దిలీప్ ఘోష్ త‌న యవ్వనం నుంచి RSS సభ్యుడు. 2015లో బీజేపీలో యాక్టివ్‌గా మారకముందు దేశవ్యాప్తంగా వివిధ పాత్రల్లో పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం) స్థానంలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన ఘనత ఆయనది. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖరగ్‌పూర్ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ కీలక పాత్ర పోషించనున్నారు.

Next Story