కర్ణాటకలో కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మైని ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. గత సీఎం యడియూరప్ప సామాజిక వర్గానికి(లింగాయత్) చెందిన బసవరాజ్ బొమ్మైకు సీఎం పీఠాన్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కొత్త సీఎంను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా కొనసాగుతున్న బొమ్మై.. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడు. సిగ్గావ్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బసవరాజ్ బొమ్మై. 2008లో బీజేపీలో చేరారు బసవరాజ్ బొమ్మై.
ఇదిలావుంటే.. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం బెంగళూరులో కొనసాగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ కర్ణాటక పరిశీలకులుగా ఉన్న కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి అరుణ్ సింగ్, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్న యడియూరప్ప కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక బసవరాజ్ బొమ్మై ఎంపికపై రాష్ట్ర బీజేపీలోనూ ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా బసవరాజ్ బొమ్మైకు పేరుంది. ఈయన కర్ణాటక రాష్ట్రానికి 23వ ముఖ్యమంత్రి.