దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ దగ్గర బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాధిపతుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిని షేక్ హసీనా.. భారత్ తమ మిత్ర దేశమని, భారత్‌కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌కు భారత్ అందించిన సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుపుతామన్నారు.
వీటిపై బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ పనిచేస్తుందని అనుకుంటున్నానని అన్నారు. తమకు భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, తాము పరస్పరం సహకరించుకుంటున్నామని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంపై సంతకం చేశారు. ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధంఖర్‌ను షేక్ హసీనా కలవనున్నారు.
భారత్, బంగ్లాలోనే కాకుండా దక్షిణాసియాలోని ప్రజలు మెరుగైన జీవన విధానాలు పొందగలరని షేక్ హసీనా అన్నారు . బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం నిన్న ఢిల్లీకి వచ్చారు. ప్రఖ్యాత నిజాముద్దీన్ ఔలియా దర్గాను షేక్ హసీనా దర్శించుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ బంగ్లా ప్రధానితో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్య రంగాలతో పాటు నదీ జలాల పంపిణీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇవాళ చర్చించనున్నారు.