23 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య
Bajrang Dal activist stabbed to death in Karnataka's Shivamogga. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా హెడ్‌క్వార్టర్స్ లో 23 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్తను
By Medi Samrat
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా హెడ్‌క్వార్టర్స్ లో 23 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్తను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. భారతి కాలనీలోని రవివర్మ లేన్‌లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హర్షను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో ఇటీవల కొన్ని కళాశాలల్లో హిజాబ్ పై వివాదం చోటు చేసుకుంది. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఘటన అనంతరం మృతుడి మద్దతుదారులు కొందరు వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర శివమొగ్గకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులకు "ముఖ్యమైన ఆధారాలు" లభించాయని, ఈ సంఘటన వెనుక ఉన్నవారిని త్వరలో అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. ''23 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. ఇలాంటి ఘటనలు జరగకూడదు. పోలీసులకు క్లూ లభించిందని, కచ్చితంగా వారిని (నిందితులను) త్వరలోనే పట్టుకుంటాము. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని జ్ఞానేంద్ర విలేకరులతో అన్నారు.
పట్టణంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించామని.. అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని డిప్యూటీ కమిషనర్ సెల్వమణి విలేకరులతో చెప్పారు. "పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నేరస్థులను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. మేము కూడా వారితో కలిసి పని చేస్తున్నాము. ఇప్పటికే నగరం మొత్తం 144 సెక్షన్‌ను విధించారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాం'' అని సెల్వమణి తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న నేరస్థుల ఆచూకీ కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ బీఎం లక్ష్మీప్రసాద్ విలేకరులకు తెలిపారు.