చెట్టును కొట్టివేశారు.. ఎంత విషాదమంటే..!

Baby birds fall to death after tree gets chopped down in Kerala’s Malappuram. పెద్ద చెట్టును ఒక్కసారిగా కొట్టివేయడంతో.. ఆ చెట్టులోని గూళ్ళలో ఉన్న చిన్న చిన్న పక్షులు కాస్తా

By Medi Samrat  Published on  2 Sep 2022 3:30 PM GMT
చెట్టును కొట్టివేశారు.. ఎంత విషాదమంటే..!

పెద్ద చెట్టును ఒక్కసారిగా కొట్టివేయడంతో.. ఆ చెట్టులోని గూళ్ళలో ఉన్న చిన్న చిన్న పక్షులు కాస్తా ప్రాణాలు పొగొట్టుకున్నాయి. చెట్టును నరికివేయడం వల్ల చాలా పక్షులు చనిపోతున్న హృదయ విదారక వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. కేరళలోని మలప్పురం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ షేర్ చేసిన 44 సెకన్ల వీడియో వేలల్లో రీట్వీట్ చేయబడింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరురంగడిలోని వీకే పాడిలో చోటు చేసుకుంది.

ఓ పెద్ద చెట్టు.. కొమ్మల్లో ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకుని ఉన్నాయి. జేసీబీ సాయంతో ఒక్కసారిగా కూల్చివేశారు. అంతే అందులోని చాలా పక్షులు ఎగిరిపోగా.. చిన్న చిన్న పక్షులు కాస్తా కింద పడి చనిపోయాయి. మరికొన్ని పక్షులు ఎగరలేక, నడవలేక నరకయాతన అనుభవించాయి. జాతీయ రహదారి విస్తరణ కోసం కేరళలోని మలప్పురం ప్రాంతంలో చెట్టును పెకిలించి వేసినట్లు చెబుతున్నారు. చెట్టు కూలిపోవడంతో దాన్ని చూస్తున్న ప్రజలు షాక్‌కు గురయ్యారు. కొన్ని పక్షులు తప్పించుకోగలిగితే, ఇంకా ఎగరడం నేర్చుకుంటున్న కొన్ని పిల్ల పక్షులు తమను తాము రక్షించుకోలేకపోయాయి.

అనుమతి లేకుండా చెట్టును నరికివేశారు :

ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసింది. అధికారుల అనుమతి లేకుండా చెట్టును నరికివేశారు. జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ ఈ సంఘటనను క్రూరమైనదిగా అభివర్ణించారు. ఇది తమ శాఖ అనుమతి లేకుండా జరిగిందని.. ఇలాంటి చెట్లను నరికివేయకుండా అటవీ శాఖ నుంచి కఠినమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. పీడబ్ల్యూడీ మంత్రి ముహమ్మద్ రియాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నివేదిక కోరారు. దీనిపై తదుపరి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిలంబూరు నార్త్ డివిజనల్ అధికారి తెలిపారు.



Next Story