భర్త ప్రాణాల కోసం భీకర పోరాటం.. గొడ్డలితో ఎలుగుబంటిని తరిమికొట్టిన వీరనారి!

అడవికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఎలుగుబంట్లు మీద పడితే ఎవరైనా భయంతో పరుగులు తీస్తారు. కానీ...

By -  అంజి
Published on : 20 Feb 2026 10:14 AM IST

Odisha, woman fights off bear, attack, husband, Crime

భర్త ప్రాణాల కోసం భీకర పోరాటం.. గొడ్డలితో ఎలుగుబంటిని తరిమికొట్టిన వీరనారి!

అడవికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఎలుగుబంట్లు మీద పడితే ఎవరైనా భయంతో పరుగులు తీస్తారు. కానీ, ఒడిశాకు చెందిన ఒక 41 ఏళ్ల గిరిజన మహిళ మాత్రం తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడింది. చేతిలో ఉన్న చిన్న గొడ్డలితో క్రూర మృగాన్ని ఎదిరించి "వీరనారి" అనిపించుకుంది. మయూర్‌భంజ్ జిల్లా కరంజియా ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని మిలు గ్రామానికి చెందిన లిలీ సోరెన్, ఆమె భర్త మాల్దే సోరెన్ (48) మంగళవారం ఉదయం హతిసాలబేడ అడవికి వెళ్లారు. అడవిలో ఆకులు, కూరగాయలు సేకరిస్తుండగా.. అకస్మాత్తుగా ఆరు ఎలుగుబంట్లు వారిపైకి వచ్చాయి.

వాటిలో ఒక ఎలుగుబంటి ఒక్కసారిగా మాల్దే సోరెన్‌పై దాడి చేసింది. అతడిని కిందకు నెట్టేసి తలపై తీవ్రంగా గాయపరిచింది. భర్త తల నుంచి రక్తం ధారలుగా కారుతుండటం చూసిన లిలీ, అక్కడి నుంచి పారిపోకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన భర్తను కాపాడుకునేందుకు లిలీ తన వద్ద ఉన్న సాంప్రదాయ గొడ్డలిని తీసింది. ఎలుగుబంటి భీకరంగా గర్జిస్తున్నా భయపడకుండా, దానిపై గొడ్డలితో పదేపదే ఎదురుదాడికి దిగింది. ఆమె ధాటికి తట్టుకోలేక ఆ క్రూర మృగం చివరకు అడవిలోకి పారిపోయింది. తన ప్రాణాలను పణంగా పెట్టి లిలీ చేసిన ఈ పోరాటం వల్ల ఆమె భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. దాడి గురించి తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని మాల్దేను సమీప ఆసుపత్రికి తరలించారు.

తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను కియోంజర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ పోరాటంలో లిలీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. లిలీ చూపిన అసాధారణ ధైర్యాన్ని అటవీ శాఖ అధికారులు కొనియాడారు. కరంజియా రేంజ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ స్వైన్ మాట్లాడుతూ.. "మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా ఆమె వెనకడుగు వేయకుండా పోరాడటం నిజంగా గర్వించదగ్గ విషయం" అని ప్రశంసించారు. అడవికి వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కష్ట కాలంలో భర్తకు తోడుగా నిలిచిన లిలీ సోరెన్ ధైర్యసాహసాలు ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. ఆమె సాహసాన్ని చూసి స్థానిక ప్రజలు జోహార్లు అర్పిస్తున్నారు.

Next Story