సామాన్యులకు అలర్ట్..ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, పన్నుల్లోనూ కీలక మార్పులు!
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే కీలకమైన ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి.
By - Knakam Karthik |
సామాన్యులకు అలర్ట్..ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, పన్నుల్లోనూ కీలక మార్పులు!
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే కీలకమైన ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో పన్నులు, జీతాలు, ప్రయాణాలు మరియు నిత్యావసరాల విషయంలో పలు కీలక సంస్కరణలు అమలు కానున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం:
1. నూతన ఆదాయపు పన్ను చట్టం - 2025
దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం ఆదాయపు పన్ను చట్టం 2025ను తీసుకువస్తోంది. క్లిష్టమైన పదజాలాన్ని తొలగించి, పన్ను వ్యవస్థను సరళీకరించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై 'అసెస్మెంట్ ఇయర్', 'ప్రీవియస్ ఇయర్' వంటి గందరగోళం లేకుండా కేవలం 'టాక్స్ ఇయర్' (పన్ను సంవత్సరం) అనే ఒకే విధానం అమల్లోకి వస్తుంది. పన్ను ఎగవేతను అరికట్టేందుకు పాన్ (PAN) నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు.
2. మారనున్న మీ 'టేక్ హోమ్' శాలరీ
కొత్త కార్మిక చట్టాల అమలుతో ఉద్యోగుల జీతాల నిర్మాణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. బేసిక్ పే మరియు డీఏ వాటాను పెంచడం వల్ల భవిష్యత్తులో వచ్చే గ్రాట్యుటీ, పీఎఫ్ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు పెరుగుతాయి. అయితే, దీనివల్ల నెలాఖరున ఉద్యోగి చేతికి అందే జీతం (Take-home salary) తగ్గే అవకాశం ఉంది.
3. రైల్వే టికెట్ రద్దు నిబంధనలు కఠినం
ప్రయాణికులకు భారతీయ రైల్వే షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటేనే రిఫండ్ లభిస్తుంది. గతంలో ఇది 4 గంటలుగా ఉండేది. 8 గంటల లోపు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు.
4. గ్యాస్ సిలిండర్ ధరలు & ఇతర మార్పులు
ప్రతినెలా ఒకటో తేదీన జరిగే సమీక్షలో భాగంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చు. దీనితో పాటు బ్యాంకింగ్ లావాదేవీల ఛార్జీలు, ఇంధన ధరల సవరణలు సామాన్యుడి గృహ బడ్జెట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.