అసదుద్దీన్ పై దాడి గురించి స్పందించిన యోగి ఆదిత్యనాథ్

Attack on Owaisi Intolerable. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 5 Feb 2022 8:04 PM IST

అసదుద్దీన్ పై దాడి గురించి స్పందించిన యోగి ఆదిత్యనాథ్

అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్‌కు చెందిన సచిన్‌గా, మరొకరిని సహరన్‌పూర్‌కు చెందిన శుభంగా గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఒవైసీ, ఆయన పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోపంతోనే దాడికి పాల్పడ్డట్టు విచారణలో వారు చెప్పారన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని పట్టుకున్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఒక మారుతి ఆల్టో కారు, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాం.. పలు పోలీసు బృందాలు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.

ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఒవైసీ వాహనంపై కాల్పులు జరపడం సహించరానిదని యోగి అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇలాంటివి ఏమాత్రం ఆమోదయోగ్యం కానివని.. తాము బ్యాలెట్ ని మాత్రమే నమ్ముతామని, బుల్లెట్ ని కాదని చెప్పారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి తమ ప్రభుత్వం అంగీకరించదని తెలిపారు. ఎన్నిక ప్రసంగాలలో మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా నాయకులు వ్యవహరించాలని అన్నారు. ఓటు బ్యాంకు కోసం ప్రజల విశ్వాసంతో ఆడుకోకూడదని అన్నారు. యూపీ కాల్పుల నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ కి జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఒవైసీ దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. తనపై జరిగిన బుల్లెట్‌ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్‌తో బదులిస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు.


Next Story