ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి 'శివుడి ఆజ్ఞ' అట..!
By Medi Samrat
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో నిందితుడు చెబుతున్న మాటలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వీధికుక్కల కోసం తాను సీఎంపై దాడి చేశానని, అలా చేయమని తనకు శివుడే చెప్పాడని నిందితుడు రాజేశ్ సకారియా వెల్లడించాడు. తాను శివుని భక్తుడినని, వీధికుక్కల సమస్యపై ఢిల్లీ వెళ్లి సీఎం సహాయం కోరమని సాక్షాత్తూ శివుడే తనకు చెప్పాడని అన్నాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో 8 వారాల్లో వీధికుక్కలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన జంతు ప్రేమికుడైన రాజేశ్ సకారియాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడు టికెట్ లేకుండానే రైలెక్కి గుజరాత్ నుంచి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, వీధికుక్కలను తరలించవద్దని కోరుతూ ఆమెకు ఒక వినతిపత్రం సమర్పించాడు. ఆమె నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన సకారియా, ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ఆమె చెంపపై కొట్టి, దుర్భాషలాడాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సకారియా చెబుతున్న ఈ దైవప్రేరణ సిద్ధాంతాన్ని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా కొట్టిపారేశారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని, నిందితుడు ఒక ప్రొఫెషనల్ నేరస్తుడని ఆరోపించారు.