ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నవీ ముంబైలోని తుర్భే ఎమ్ఐడీసీ ప్రాంతంలోని ఓ షోరూమ్ కమ్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో కనీసం 40 బీఎండబ్ల్యూ కార్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో బిఎమ్‌డబ్ల్యూ కార్ల షోరూమ్‌లో మంటలు చెలరేగడంతో అక్కడ పార్క్ చేసిన కార్లు ధ్వంసమైనట్లు ఎంఐడిసి ఫైర్ సర్వీసెస్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఆర్‌బి పాటిల్ తెలిపారు.
పది అగ్నిమాపక యంత్రాల ద్వారా మంగళవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చామని, కనీసం 40-45 బీఎండబ్ల్యూ కార్లు పూర్తిగా కాలిపోయాయని ఆయన తెలిపారు. దాదాపు ఆరు గంటలపాటు శ్రమించి అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని వాశి అగ్నిమాపక కేంద్రం అధికారికి ప్రాథమికంగా సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.