రెండు రాష్ట్రాల్లో భారీగా పోలింగ్..
Assam West Bengal Elections Polling. అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ పెద్దఎత్తున
By Medi Samrat Published on 27 March 2021 5:53 PM IST
అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ పెద్దఎత్తున నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమబెంగాల్‌లో 70 శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తొలి విడుత పోలింగ్ కొనసాగుతున్నది. అసోంలో రెండు విడతల పోలింగ్‌లో భాగంగా తొలి విడతగా 47 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతగా 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆరు గంటల తర్వాత కూడా అప్పటికే క్యూ లైన్‌లలో ఉన్నవారికి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 1 రెండో విడుత పోలింగ్ జరుగనుంది. రెండు రాష్ట్రాలలోనూ ఇప్పటికే భారీగా పోలింగ్ నమోదు అయ్యింది.. సమయం ముగిసేసరికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. రెండు రాష్ట్రాల్లోనూ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అసోంలో రెండోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ కూటమి భరోసా వ్యక్తం చేస్తోంది. పశ్చిమబెంగాల్ ఎన్నికలను అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, కాంగ్రెస్-వామపక్ష కూటమి గట్టి పోటీ ఇస్తామని చెబుతోంది.