అసోంలో ఉగ్రవాద సంస్థలు భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే అసోం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. పాక్ ఇంటెలిజెన్స్ ఏజేన్సీ, టెర్రరిస్ట్ సంస్థ అల్ ఖైదాతో కలిసి ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు భారత్ నిఘా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలు), ఆర్మీ క్యాంపులు, మతపరమైన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశముందన్నాయి. దీంతో అసోం ప్రభుత్వం అప్రమత్తమైంది. గౌహతి పోలీస్ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.
అన్ని చోట్ల భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజుల కిందట దరాంగ్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. అలాగే 11 మంది పోలీసులతో సహా 20 మంది గాయపడ్డారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో బాంబు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. బస్‌స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరగొచ్చని... అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు తెలిపాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్రకుట్ర పన్నినట్లు సమాచారం.