పదో తరగతి పరీక్షల్లో అందరూ ఫెయిల్.. 34 పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం
Assam govt to shut 34 schools as all students fail in Class X boards.అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలను మూసివేయనున్నట్లు తెలిపింది.
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2022 11:02 AM ISTపదో తరగతి ఫలితాలు వెలువడగానే ఏ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంత మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు అనే వివరాలను సాధారణంగా చూస్తుంటారు. కాగా.. కొన్ని పాఠశాలలో అందరూ విద్యార్థులు ఫెయిల్ అవ్వడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే.. అసోం రాష్ట్రంలో ఏకంగా 34 ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఫలితాలు వచ్చాయి. ఈ 34 పాఠశాలలో చదువుకున్న పదో తరగతి విద్యార్థులు ఎవ్వరూ కూడా ఈ సంవత్సరం మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో పాస్ కాలేదు. దీంతో అగ్రహించిన అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలను మూసివేయనున్నట్లు తెలిపింది.
ఈ జాబితాలో కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో ఏడు పాఠశాలలు, జోర్హాట్ లో 5, కాచర్ లో 5, ధుబ్రీ, గోల్‌పరా, లఖింపూర్, నాగావ్ ల నుంచి రెండు పాఠశాలల చొప్పున, గోలాఘాట్, కమ్రూప్, కోక్రాఝర్, నల్బరి, హైలాకండి, పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ చిరాంగ్, దర్రాంగ్ మరియు దిబ్రూగర్ జిల్లాల నుండి ఒక్కొక్క పాఠశాల ఉంది.
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అస్సాం (SEBA) నిర్వహించిన ఈ సంవత్సరం HSLC పరీక్షలకు ఈ పాఠశాలల నుండి 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. దీంతో ఈ 34 పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం అసోం ప్రభుత్వం తీసుకుంది. అయితే ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో చేర్పించే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు.
"పాఠశాలల ప్రాథమిక విధి విద్యను అందించడం. ఒక పాఠశాల తన విద్యార్థులు పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చూసుకోలేకపోతే, ఈ పాఠశాలలను నిర్వహించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు." అని విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు అన్నారు. అలాంటి పాఠశాలల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయకూడదన్నారు.
ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ పదో తరగతి పరీక్షల్లో ఫలితాలు సరిగా లేకపోవడంతో 102 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సున్నా ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు కాకుండానే 10శాతం లోపు ఉత్తీర్ణత ఉన్న పాఠశాలలు ఆ జాబితాలో ఉన్నాయి. అదే నెలలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న దాదాపు 800 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రణాళికలను ప్రకటించింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాల నుంచే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పాఠశాలను మూసివేయడం పరిష్కారం కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. మన దేశవ్యాప్తంగా అనేక కొత్త పాఠశాలలను తెరవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలను మూసివేసే బదులు వాటిని బాగు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా తీర్చి దిద్దాలని ట్వీట్ చేశారు.
स्कूल बंद करना समाधान नहीं है। हमें तो अभी पूरे देश में ढेरों नए स्कूल खोलने की ज़रूरत है। स्कूल बंद करने की बजाय स्कूल को सुधार कर पढ़ाई ठीक कीजिए। https://t.co/MBni1PTdng
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 24, 2022