అస్సాం ప్రభుత్వం ప్రతి విద్యా సంవత్సరం చివరిలో 5, 8 తరగతుల విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షలను నిర్వహించనుంది. పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు పై తరగతులకు ప్రమోట్ చేయబడదని అధికారులు తెలిపారు. "ప్రతి విద్యా సంవత్సరం చివరిలో 5వ తరగతి, 8వ తరగతిలో రెగ్యులర్ పరీక్షలు నిర్వహించాలని.. పరీక్షలో విఫలమైతే వారిని అదే క్లాస్ లో చదివేలా చేయాలని అస్సాం క్యాబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది" అని విద్యా మంత్రి రనోజ్ పెగు ఒక ట్వీట్‌లో తెలిపారు. రెండు నెలల వ్యవధిలో మళ్లీ పరీక్షను నిర్వహించి.. వారిని ప్రమోట్ చేయడానికి అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వం కూడా 5, 8 తరగతుల విద్యార్థులను వార్షిక పరీక్షలను క్లియర్ చేయడానికి తప్పనిసరి చేసింది. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 'నో డిటెన్షన్ పాలసీ' చాలా ప్రగతిశీలమైనదని, అయితే విద్యావ్యవస్థ సన్నద్ధత లేకపోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాన్ని పొందలేకపోయిందని అన్నారు. 10, 12 తరగతుల మాదిరిగానే ప్రాథమిక తరగతులలో కూడా మంచిగా చదివేలా ప్రణాళికలను తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.