అసోం-మిజోరాం సరిహద్దు వివాదం ఇటీవల ఎంత హింసాత్మకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసోం-మిజోరాం సరిహద్దుల్లో జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అస్సాంకు చెందిన పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. బ్రిటీష్ కాలం నాటి సరిహద్దు వివాదం ఒక్కసారిగా బయటకు రావడంతో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమస్యపై చర్చించేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత్‌బిస్వా శర్మ సోమవారం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అసోం-మిజోరాం సరిహద్దుల వ్యవహారం, ఈశాన్య ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణపై కీలకంగా చర్చించనున్నారు. సీఎం శర్మతో పాటు అసోం బీజేపీ ఎంపీలు కూడా ప్రధానిని కలుసుకోనున్నట్లు తెలుస్తోంది.
శనివారంనాడే ఢిల్లీకి వచ్చిన శర్మ కొన్ని కారణాల వల్ల హోం మంత్రిని అమిత్‌షాను కలుసుకోలేకపోయారు. సరిహద్దుల వివాదంపై మిజోరం, అసోం మధ్య గత నెలలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్రం జోక్యంతో సరిహద్దు ప్రాంతాల్లో తటస్థ బలగాల పెట్రోలింగ్ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త ప్రకటన చేశాయి.