ధరల పెరుగుదలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో కూరగాయల ధరలు పెరగడానికి ముస్లిం సమాజమే కారణమని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నా.. నగరాలకు చేరేసరికి ధరలు పెరుగుతాయన్నారు. విక్రేతలందరూ రేట్లు పెంచుతున్నారని.. వారిలో ఎక్కువ మంది మియా (తూర్పు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు) వారేనని సీఎం శర్మ పేర్కొన్నారు.
అస్సాం సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఖండించారు. కూరగాయల ధరల పెరుగుదలకు ఒక నిర్దిష్ట సమాజాన్ని బాధ్యులను చేయడం బీజేపీ ముఖ్యమంత్రి సంకుచిత ఆలోచనను ప్రదర్శించడం ఖండించదగినది అని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ లోపాలపై బీజేపీ ఇతరులను తప్పుబడుతుందన్నారు.
సీఎం వ్యాఖ్యలపై.. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎఐయుడిఎఫ్) చీఫ్, ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. గౌహతిలో మియాన్-ముస్లింలు కూరగాయలు, మసాలాలు విక్రయించడానికి అనుమతించరని హిమంత బిస్వా శర్మ అన్నారు. సీఎం రాష్ట్రానికి అధినేత, ఆయన నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం సరికాదన్నారు. అతను అలా అనకూడదు. అది నాకు నచ్చలేదు. ఇదంతా చేస్తూ ముస్లింలు, అస్సామీ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఏదైనా సంఘటన జరిగితే దానికి ప్రభుత్వం, సీఎం శర్మ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అసోం సీఎం చేసిన ఈ వ్యాఖలపై మజ్లిస్ పార్టీ అధినే అసదుద్దీన్ ఒవైసీ రియాక్టయ్యారు. 'అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయ్యారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా , కోడి గుడ్డు పెట్టకపోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమో' అని ఒవైసీ అన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా.. మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఓవైసీ ఎద్దేవా చేశారు.