నరకం అనుభవిస్తున్నాం.. సీజేఐ చంద్రచూడ్‌కి విద్యార్థి లేఖ
దేశ రాజధాని ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వర్షం నీరు చేరడంతో శనివారం సాయంత్రం ముగ్గురు సివిల్స్ ఆశావహులు నీట మునిగి చనిపోయారు
By Medi Samrat Published on 29 July 2024 1:45 PM GMTదేశ రాజధాని ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వర్షం నీరు చేరడంతో శనివారం సాయంత్రం ముగ్గురు సివిల్స్ ఆశావహులు నీట మునిగి చనిపోయారు. ఈ విషయమై దేశ వ్యప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ వంటి ప్రాంతాల్లో పేలవమైన మౌలిక సదుపాయాలపై ఒక విద్యార్థి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.
ఢిల్లీలో నరకం లాంటి జీవితం గడపాల్సి వస్తోందని విద్యార్థి అవినాష్ దూబే సీజేఐకి రాసిన లేఖలో ఆరోపించారు. ముగ్గురు తోటి విద్యార్థుల మరణానికి కారణమైన అధికారులు, ఇతరులపై చర్యలు తీసుకోవాలని.. ఇతర విద్యార్థుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని విద్యార్థి తన లేఖలో CJI చంద్రచూడ్‌ను కోరారు.
ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనను అవినాష్ దూబే లేఖలో ప్రస్తావించారు. విద్యార్థి తన లేఖలో ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ ఇలా వ్రాశాడు.. మునిసిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం కారణంగా చాలా సంవత్సరాలుగా ముఖర్జీ నగర్, రాజేంద్ర నగర్ వంటి ప్రాంతాలు ప్రతి సంవత్సరం నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లలో నడవాలి. పరీక్షలకు ప్రిపేర్ కావాలంటే ఇక్కడ నరకంతో కూడిన జీవితం గడపాలి. వరదలు, మురుగు నీరు కొన్నిసార్లు ఇళ్లలోకి కూడా చేరుతున్నాయని పేర్కొన్నారు.
ముగ్గురు విద్యార్థుల మరణం తరువాత మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని 13 కోచింగ్ సెంటర్లను సీల్ చేసింది. వారు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్ బృందం ఆదివారం ఈ ప్రాంతంలోని అనేక కోచింగ్ సెంటర్‌లను తనిఖీ చేసింది. ఆ ప్రాంతంలో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. తరగతులు ఎక్కడ జరుగుతాయనే విషయమై సోదాలు చేసింది. బేస్‌మెంట్ ప్రాంతంలో క్లాసులు జరిగే 13 కేంద్రాలను గుర్తించి వాటిని సీల్ చేసింది.