అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించబోతున్నారా..?
Ashok Gehlot may step down as Rajasthan CM. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే అశోక్ గెహ్లాట్
By Medi Samrat Published on 25 Sep 2022 11:36 AM GMTకాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందే అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. రాజస్థాన్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జైపూర్ నివాసంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు తన శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని సిఎం గెహ్లాట్ ప్రకటించిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో మార్పు వస్తుందనే ఊహాగానాల కారణంగా ఈ సమావేశం కీలకంగా మారింది.
కొత్త CLP నేతపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉందని అంటున్నారు. గెహ్లాట్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుకుంటున్నారు. గాంధీ కుటుంబం నుండి పైలట్‌కు మద్దతు ఉందని.. రాబోయే రోజుల్లో ఆయనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అనే ప్రచారం కూడా తారాస్థాయికి చేరుకుంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నినాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో.. అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసి.. ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని అంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ అజయ్ మాకెన్‌తో పాటు మల్లికార్జున్ ఖర్గేను పరిశీలకులుగా నియమించారు. రాజస్థాన్ శాసనసభ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశానికి వారు హాజరవుతారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కెసి వేణుగోపాల్ తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 24 నుండి 30 వరకు నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ పత్రాల పరిశీలన తేదీ అక్టోబర్ 1, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, అక్టోబర్ 17న ఎన్నిక జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అక్టోబర్ 19న ఉంటుంది.