రేప్ కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు

Asaram Bapu jailed for life in 2013 rape case. రేప్‌ కేసులో స్వయం ప్రకటిత దైవుడు ఆశారాం బాపుకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు

By Medi Samrat  Published on  31 Jan 2023 4:41 PM IST
రేప్ కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు

రేప్‌ కేసులో స్వయం ప్రకటిత దైవుడు ఆశారాం బాపుకు గుజరాత్‌లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. సూరత్‌కు చెందిన ఒక మహిళ.. 10 సంవత్సరాల క్రితం అహ్మదాబాద్‌లోని మోటేరాలోని ఆశారాం ఆశ్రమంలో ఉన్నప్పుడు తనపై పదేపదే అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఆశారాం, అతని కుమారుడు నారాయణ్ సాయి తమ‌పై అత్యాచారం చేశారని మహిళ, ఆమె సోదరి ఆరోపించారు. ఈ కేసులో నారాయణ్ సాయికి 2019లో జీవిత ఖైదు పడింది. దేశవ్యాప్తంగా నిర‌స‌న‌ల‌ తర్వాత ఆశారాం 2013లో అరెస్టయ్యాడు.

ఆశారామ్‌పై కేసు పెట్టిన మహిళ తనపై కొన్నేళ్లుగా వివిధ ఆశ్రమాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ విష‌య‌మై 2013లో తొలిసారి కేసు నమోదైంది. ఈ కేసులో విచారణలో మొత్తం 68 మంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి దివ్య రవియాకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులు కాగా, వారిలో ఒకరు అప్రూవర్‌గా మారారు.

అత్యాచారం కేసులో సోమ‌వారం గాంధీనగర్ కోర్టు ఆశారాంను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో మిగిలిన నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.. ఆశారాం భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులు.. ధ్రువ్‌బెన్, నిర్మల, జస్సీ, మీరా కూడా నిందితులుగా ఉండ‌గా.. గాంధీనగర్ కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రత్యేక లైంగిక వేధింపుల కేసులో ఆశారాం బాపు ప్రస్తుతం జోధ్‌పూర్‌లోని జైలులో ఉన్నారు. 2013లో తన జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.


Next Story