ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం మహారాష్ట్ర సంక్షోభంపై స్పందించారు. ఎమ్మెల్యేలను 'కోతులు' అని కామెంట్ చేశారు. జరుగుతున్న పరిణామాలపై 'కోతుల నృత్యంలా కనిపిస్తుంది.. ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకే కోతుల వలె వ్యవహరిస్తున్నారు' అని అభివర్ణించారు. శివసేన, అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ అంతర్గత వ్యవహారంలో తాను గానీ, తమ పార్టీ ప్రమేయం ఉండబోదని ఆయన చెప్పారు.
"మహా వికాస్ అఘాదీని ఈ విషయంపై చర్చించనివ్వండి.. అది వారి సమస్య. నేనెందుకు అక్కడికి వెళ్లి ఏదో చెప్పాలి? మేము జరుగుతున్న డ్రామాపై నిఘా ఉంచాము" అని ఓవైసీ అన్నారు. మహా సంక్షోభంపై మాట్లాడాలి అని ఓ మీడియా ప్రతినిధి అడగడంతో ఒవైసీ ఈ విధంగా స్పందించారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యులతో కలిసి బిజెపి పాలిత గుజరాత్‌కు వెళ్లిపోవడంతో ఈ సంక్షోభం చెలరేగింది.