ఆయన శాస్త్రవేత్త ఎందుకు కాలేకపోయారో చెప్పాలి.. యూపీ సీఎం వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు.
By Medi Samrat
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేశారు. ఉర్దూ భాషపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీఎం యోగి ప్రకటనపై ఒవైసీ ఎదురుదాడి చేశారు. ఒవైసీ మాట్లాడుతూ.. యూపీ సీఎంకు ఉర్దూ తెలియదని.. ఆయన శాస్త్రవేత్త ఎందుకు కాలేదో.. ఆయన మాత్రమే సమాధానం చెప్పగలరని అన్నారు.
యూపీ సీఎంకు ఉర్దూ రాదని స్పష్టమవుతోందని, అయితే ఆయన శాస్త్రవేత్త ఎందుకు కాలేకపోయారో ఆయనే సమాధానం చెప్పగలరని ఓ కార్యక్రమంలో ఒవైసీ అన్నారు. యూపీ సీఎం భావజాలంతో వచ్చిన వారెవరూ ఈ దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. సీఎం యోగి పూర్వీకులు ఎవరూ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. వారు గోరఖ్‌పూర్ నుండి వచ్చారు. రఘుపతి సహాయ్ 'ఫిరాక్' కూడా అదే గోరఖ్‌పూర్ నుండి వచ్చారు. ఆయన ప్రసిద్ధ ఉర్దూ కవి, కానీ ఆయన ముస్లిం కాదు.. అది ఆయన మేధో సామర్థ్యం అన్నారు.
యూపీ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ విపక్షాలను టార్గెట్ చేయడం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ నేతలు తమ పిల్లలకు ఇంగ్లీషు స్కూళ్లలో పాఠాలు చెప్పిస్తారని.. సాధారణ ప్రజల పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఎప్పుడైతే మాట్లాడుతుందో.. అప్పుడు ఉర్దూను సమర్థించడం ప్రారంభిస్తారని సీఎం యోగి అన్నారు. దేశాన్ని పిడివాదం వైపు తీసుకెళ్లాలని ఎస్పీ భావిస్తోందని సీఎం యోగి అన్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు యుపీ అసెంబ్లీలో ఇంగ్లీషు భాష వాడకాన్ని సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించింది. ప్రతిపక్ష నాయకుడు మాతా ప్రసాద్ పాండే “ఈ అసెంబ్లీలో ఇంగ్లీషును ఉపయోగించడం సమర్థించబడదు. ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఇస్తూ హిందీని నిర్వీర్యం చేస్తున్నారు. మీరు అసెంబ్లీలో ఇంగ్లీషు భాషను ఉపయోగిస్తే.. ఉర్దూ కూడా వాడండి’ అని సూచించారు. దీనిపై సీఎం యోగి వ్యంగ్యంగా స్పందించారు. “సోషలిస్టుల ప్రవర్తనలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. తమ పిల్లలను ఇంగ్లీషు పాఠశాలలకు పంపి ఇక్కడ ఇంగ్లీషును వ్యతిరేకిస్తారు. ఇలాంటి నిరసనను ఖండించాలన్నారు.
ఇదిలావుంటే.. దేశంలో మరోసారి భాషాయుద్ధం మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొద్ది రోజుల క్రితం హిందీ భాషపై వివాదాస్పద పోస్ట్ చేయడంతో ఆ చర్చ కొనసాగుతుంది.