కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi slams PM Modi on Russia-Ukraine war. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు
By Medi Samrat Published on 28 Feb 2022 10:03 AM GMTరష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడి పరిస్థితులను తెలిపే చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ భారతీయులపై దాడికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. "దేశంలో పీఎం గుజ్రాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇరాక్‌లో యుద్ధం ప్రారంభం కాకముందే 1 లక్షా 70 వేల మంది భారతీయులను తరలించారు. ఇప్పుడు సంఖ్య వేలల్లో ఉంది. బయటకు వస్తున్న వీడియోలు కలవరపెడుతున్నాయి" అని ఆయన అన్నారు.
ఒక ప్రముఖ వెబ్‌సైట్‌తో ఆయన మాట్లాడుతూ "బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రవర్తించాలని, కేవలం సలహా ఇవ్వడం వల్ల ఏమీ జరగదు. మీరు మీ సిబ్బందిని బయటకు తీశారు. పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆశావహంగా కనిపించడం లేదు." అని అన్నారు. "ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని అక్కడి నుండి బయటకు తీసుకురావడం ప్రభుత్వ మొదటి బాధ్యత. ప్రభుత్వం తన వనరులన్నింటినీ ఉపయోగించాలి, మన విద్యార్థులు ఎవరూ అక్కడ చిక్కుకోకూడదు." అని అసదుద్దీన్ అన్నారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా ప్రారంభించింది. ఆపరేషన్ గంగా కింద ఇప్పటివరకు ఐదు విమానాలు భారతదేశానికి చేరుకున్నాయి. ఈ విమానాల్లో 1500 మందికి పైగా భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్తున్నారు.