భారతదేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారీకి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా మంగళవారం తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో అదార్ పూనావాలా భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాండవియాతో తన సమావేశం "ఎప్పటిలాగే" బాగా జరిగిందని పూనావాలా అన్నారు.
"వ్యాక్సిన్ కోసం అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై మంత్రికి వివరించాను. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నామని" అని పూనావాలా చెప్పినట్లు వార్తా సంస్థ ఎఎన్ఐ నివేదించింది.
ఇదిలావుంటే.. ఢిల్లీలో మంగళవారం మూడో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. 31 ఏళ్ల నైజీరియన్ జాతీయుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇక కేరళలో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. మొదటి మరణం కూడా అక్కడే నమోదయ్యింది.