ఢిల్లీలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం నగరంలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలు, రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఇంతకుముందు, ప్రైవేట్ కార్యాలయాలు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడ్డాయి. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) సవరించి జారీ చేసిన తాజా మార్గదర్శకాలలో.. అవసరమైన సేవలు, మినహాయింపు కేటగిరీ కిందకు వచ్చే ప్రైవేట్ కార్యాలయాలు మాత్రమే తెరిచి ఉంచడానికి అనుమతించబడతాయని తెలిపారు.
అంతకుముందు అన్ని ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం మంది ఉద్యోగులతో.. వర్క్ ఫ్రం హోమ్ పద్దతిలో పని చేస్తున్నాయి. తాజా నిర్ణయంతో ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లు, బార్‌లు పూర్తిగా మూసివేయబడతాయి. రెస్టారెంట్ల నుండి హోమ్ డెలివరీ, ఆహార పదార్థాలను తీసుకెళ్లే సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రెస్టారెంట్లు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు వారి సీటింగ్ కెపాసిటీలో 50 శాతంతో డైన్-ఇన్ సదుపాయాన్ని నిర్వహించడానికి అనుమతించబడ్డాయి. నగరంలోని బార్‌లు కూడా 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరవడానికి అనుమతించారు. సోమవారం, ఢిల్లీలో 19,166 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 17 మరణాలు నమోదయ్యాయి. కేసుల పాజిటివిటీ రేటు 25 శాతానికి పెరిగింది.