జీతంలో సగం పన్నులు చెల్లిస్తున్నారు.. వారి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదు.?
రైతులు, మధ్య తరగతికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
By Medi Samrat Published on 28 Jan 2025 3:29 PM ISTరైతులు, మధ్య తరగతికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతులు, మధ్యతరగతి రుణాలను మాఫీ చేయాలని ఆప్ కన్వీనర్ ఈ లేఖ ద్వారా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. కార్పొరేట్లకు రుణమాఫీని నిషేధించే చట్టాన్ని రూపొందించాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బిలియనీర్లకు ఇచ్చిన రుణమాఫీని నిషేధించేందుకు దేశవ్యాప్తంగా చట్టాన్ని తీసుకురావాలని ఆప్ అధినేత ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
మంగళవారం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం ద్వారా ధనికుల పక్షపాతిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇలాంటి విధానాల వల్ల సామాన్య పౌరులపై అధిక పన్నుల భారం పడుతుందని.. ధనికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయమై ప్రశ్నలు లేవనెత్తిన కేజ్రీవాల్.. “సామాన్య ప్రజలు వారి జీతంలో సగం పన్నులు చెల్లిస్తున్నారు.. ధనికుల రుణాలు మాఫీ చేయబడుతున్నాయి.. కేంద్ర ప్రభుత్వం గృహ రుణాలు, కారు రుణాలు, సామాన్య ప్రజల ఇతర ఆర్థిక భారాలను ఎందుకు మాఫీ చేయడం లేదు? అని ప్రశ్నించారు.
బిలియనీర్ల రుణమాఫీని నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ రేట్లను సగానికి తగ్గించవచ్చని, అలాగే పన్ను ఆదాయ పరిమితిని రెట్టింపు చేసి నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించవచ్చని ఆయన నొక్కి చెప్పారు. ఇదొక భారీ కుంభకోణమని, దీనికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గానూ 62 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో, బీజేపీ తన 27 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని ముగించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది.. కోల్పోయిన మద్దతు పునాదిని తిరిగి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.