ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే గుజరాత్‌లోని గృహ వినియోగదారులందరికీ నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందజేస్తామని పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం చెప్పారు. గృహ వినియోగదారులందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తాం. మేము అన్ని నగరాలు, గ్రామాలలో 24X7 విద్యుత్ సరఫరాను అందిస్తాం"అని సూరత్ లో విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు.
తమ పార్టీకి గుజరాత్ రాష్ట్రాన్ని పాలించే అవకాశం వస్తే.. డిసెంబర్ 31, 2021 వరకు అన్ని పాత విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని కూడా కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ బుధవారం అర్థరాత్రి సూరత్‌కు చేరుకున్నారు. రాబోయే కొద్ది వారాల్లో.. తమ పార్టీ గుజరాత్‌లో అధికారంలోకి వస్తే వారి కోసం ఏమి చేయాలనే విషయమై ఎజెండాను గుజరాత్ ప్రజలతో పంచుకుంటామని ఆయన చెప్పారు.