గోవా సహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిమిత్తం ఆదివారం గోవా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవాలో ఆప్ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ఒక్కరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని.. ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికీ 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ స్వతంత్ర భారతదేశంలో అత్యంత నిజాయితీ గల పార్టీ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా మాకు నిజాయితీ సర్టిఫికేట్ ఇచ్చారని అన్నారు. నాపై, మనీష్ సిసోడియాపై ప్రధాని మోదీ దాడులు చేశారని.. 21 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి 400 ఫైళ్లను తనిఖీ చేసినా మాకు వ్యతిరేకంగా ఏమీ కనిపించలేదని తెలిపారు. మేం అవినీతి చేయడం లేదని.. గోవాలో ప్రభుత్వం ఏర్పడితే ఎంతో నిజాయితీతో ప్రభుత్వాన్ని నడుపుతామని అన్నారు.
గోవాలో ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ హవా నడుస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం ఆ రెండూ ఒకే పార్టీగా మారాయని.. నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లిపోయారు. వారంతా ఒకటే అని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. గోవాలో ప్రస్తుత పరిస్థితికి అన్ని పార్టీలు కారణమని కేజ్రీవాల్ అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లో కొత్త ఆశగా ఆవిర్భవించిందని.. ఢిల్లీలోని మా ప్రభుత్వం విద్యారంగంలో గొప్ప కృషి చేసిందని పేర్కొన్నారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మంచి విద్యా వ్యవస్థను అందిస్తామని తెలిపారు.