కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ అవినీతి కేసులో బెయిల్ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది

By Medi Samrat  Published on  5 Sept 2024 4:18 PM IST
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ అవినీతి కేసులో బెయిల్ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కేజ్రీవాల్ తరఫు వాదనలు వినిపించగా.. సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న ధర్మాసనం తీర్పును మంగ‌ళ‌వారం వెల్ల‌డించనున్న‌ట్లు తెలిపింది.

బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ 'ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు లేదు. అలాగే, ఇటీవలే కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. ఢిల్లీ సీఎం సమాజానికి ప్రమాదకరం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని సింఘ్వీ అన్నారు. ఒకసారి ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేసిందని.. ఒకసారి కేజ్రీవాల్‌కు ఈడీ మనీలాండరింగ్ కేసులో బెయిల్ కూడా లభించిందని చెప్పారు. కేజ్రీవాల్ రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉన్నారని.. సమాజానికి ముప్పు లేదని సింఘ్వీ వాదించారు. రెండేళ్లుగా సీబీఐ అరెస్ట్ చేయలేదని.. జూన్ 26న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఆయన అన్నారు.

కేజ్రీవాల్‌ బెయిల్‌పై ఆగస్టు 23న అఫిడవిట్‌ సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, సీబీఐ అఫిడవిట్‌పై రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.

సింఘ్వీ వాదనలపై సీబీఐ తరపున వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలని.. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించకూడదనేది మొదటి అభ్యంతరమని అన్నారు. కేజ్రీవాల్ ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన కోసం భిన్నమైన విధానాన్ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోందని రాజు అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు.. అవి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రెండో పిటిషన్‌లో కేజ్రీవాల్ బెయిల్ కోసం అప్పీల్ చేశారు. అంతకుముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కోరింది. కేజ్రీవాల్ బెయిల్‌ను హైకోర్టు వ్యతిరేకించగా.. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎం సాక్షులను ప్రభావితం చేయవచ్చని సీబీఐ వాదించింది.

Next Story