అవినీతి ఆరోపణలపై మంత్రిని తొలగించిన కొద్దిసేపటికే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ప్రశంసించారు. భగవంత్ మాన్ చర్య నాకు కన్నీళ్లు తెప్పించింది' అని కేజ్రీవాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. "నిన్ను చూసి గర్వపడుతున్నా భగవంత్. మీ చర్య నాకు కన్నీళ్లు తెప్పించింది. ఈరోజు యావత్ దేశం ఆప్ గురించి గర్విస్తోంది" అని ఢిల్లీ ముఖ్యమంత్రి రాశారు.
అవినీతి ఆరోపణలపై పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను తన పదవి నుండి రాష్ట్ర మంత్రివర్గం నుండి తొలగించారు. అతని తొలగింపు తర్వాత.. సింగ్లాను ఎసీబీ అరెస్టు చేసింది.
అనంతరం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "మేము చేసినదానికి చాలా ధైర్యం అవసరం. భారతదేశంలో రాజకీయాలు చాలా తిరోగమనం చెందాయి, అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రారంభం లాంటిది" అని అన్నారు. మేం తలలు పోగొట్టుకోవచ్చు.. కానీ ద్రోహం చేయమని అన్నారు. ఆప్ 'నిజాయితీగల పార్టీ' అని, తన ప్రభుత్వంలోని మంత్రిపై చర్య తీసుకున్నందుకు భగవంత్ మాన్‌ను చూసి గర్వపడుతున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఉన్న నా మంత్రిపై కూడా చర్యలు తీసుకున్నాను అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
అంతకుముందు, భగవంత్ మాన్, ట్విట్టర్‌లో దాదాపు ఆరు నిమిషాల నిడివిగల వీడియోలో, "నేను ఆ మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను, అతనిని మంత్రివర్గం నుండి తొలగిస్తున్నాను. అతనిపై కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను. ఆ మంత్రి విజయ్. సింగ్లా. అతను తన డిపార్ట్‌మెంట్‌లో అవినీతికి పాల్పడ్డాడు. దానిని ఒప్పుకున్నాడు. అవినీతి రహిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు ఆప్ ప్రభుత్వం కట్టుబడి ఉందని" భగవంత్ మాన్ అన్నారు.